Monday, December 27, 2010

రగులుతున్న తెలంగాణా..


రగులుతున్న తెలంగాణా రణ స్థలమై నిలువనుంది,

మరుగుతున్న అగ్ని జ్వాల అఖండమై ఎగియనుంది,

పారాహుషార్ ప్రభువులారా ! ప్రళయం రానుంది,

రాజకీయ చదరంగానికి చరమ గీతం పాడనుండి.


చిట్టిచీమలు జట్టుగట్టి పాముల పనిబట్టినట్టు,

వానర సైన్యం పట్టుబట్టి లంకను జయించినట్టు,

'ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ ' ఆంగ్లేయులను తరిమినట్టు,

సర్ఫరోషి కి తమన్నా "అని భగత్ సింగ్ కదిలినట్టు,


తండ తండా కదలనుంది,టూటాకో తల పెట్టనుంది,

వీధి వాడా సహాయనిరాకరణ తో పోరాటాన్ని ఎక్కుపెట్టనుంది,

ఉరి శిక్షలకు భయపడని పులి బిడ్డల పురటి గడ్డ,

బానిస సంకెళ్ళను దెంచ కదిలె తెలంగాణా పోరుగడ్డ.


కవి నాల్కేన శారదుంటే ,రాబోయే తెలంగాణ

ఉద్యమ కొలిమిన పండిన మేలిమి సువర్ణం.

ఇక అడ్డుకుంటే అభాసుపాలు,కాదంటే కదనమే నేడు,

ప్రజాస్వామిక పోరాట ప్రభంజనం లో పతనమే వీరు..

జై తెలంగాణ..!

Monday, December 20, 2010

కాంగ్రెస్ కపటాల కోట ..

తెలంగాణా కన్నీటి కథ తో వ్యాపరం చేయడం కాంగ్రెస్ కి తెలిసినంత ఎవరికీ తెలీదేమో ..అధికార గర్వమో ,ఆహంకారమో తెలీదు కాని అందలం ఎక్కించిన వాళ్ళని తన్నే సంస్కృతి చాలా బలంగా నాటుకపోయింది..అధిష్టానం ఓ దృతరాష్ట్రుడు.,మా ఆంధ్ర నాయకులు దుర్యోధన ,కర్ణులు..శ్రీకృష్ణుడు రాయబారం చేసినా ఉపయోగం ఏంటి.. డిసెంబర్ 31 కోట్ల ప్రజలు ఎదురుజూస్తున్నారు కొత్త సంవత్సరం కొరకు కాదు,కొత్త వెలుగు కొరకు,బిడ్డల కొత్త భవిష్యత్తు కొరకు..వాళ్ళ ఆశలు ఆవిరై, దుక్కం కన్నీరై రాలాల్సిందే..పొన్నం గారు అమ్మ కి ప్లీనరీ లో వినతి చేసారు,మిగితా కాంగ్రెస్ వాళ్ళు వంత పాడారు.. జరగ బోయే దేంటో ,రిపోర్ట్ లో ఏముందో, వాళ్ళ అమ్మ ఏమి రాయిన్చిందో తెలిసి నాటకాలకు తెర దిన్చట్లేదు..తెలంగాణా చేస్కున్న దురదృష్టం నిజంగా ఒక్కడు ఎదిరించి తెలంగాణా కోసం నిలబడలేదు ..నిజంగా చవటలు,దద్దమ్మలు అని k.c.r 25 లక్షల మంది సాక్షిగా తిట్టినా ఆత్మ గౌరవం ఉన్నాడు ఒక్కడు లేదు..నారాజు గాకుండ్రి,ఆగం ఆగం గాకుండ్రి ఇంత కంటే విడమరిచి ఎలా చెప్పాలో ఆ నాయకునికి అర్థంకావట్లేదు .. తెలంగాణా లో పరిస్థితి ఉహించుకునే ధైర్యం మాకెవరికి లేదు...ఎవరి ఎవరి నని ఆపుతాం, ఏ ఊర్లో ఏ వాడలో ఎవరిని ఉరి తాళ్లకో,సెల్ టవర్లకో ,పెట్రోల్ మంటలకో బలికాకుండా కాపలా గాస్తం..కేసు లున్న యువత నక్షలైట్లు కాకుండా ఎలా ఆపుతాం..
తెలంగాణా రాష్ట్రం మరో రెండేళ్ళకో,మూడేళ్ళకో ఏర్పడక తప్పదు..కాంగ్రెస్ కాకుంటే b.j.p ఇస్తది,తెచ్చుకుంటాం కాని ఇంకా ఎంత మంది సమిధలు కావాలి..ఎంత రక్తపాతం జరగాలి..మమ్మల్ని చంపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంచండి లేదా మా తెలంగాణా మాకిచ్చి బతకనివ్వండి..ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతానికి బానిసలుగా మార్చే హక్కు కాంగ్రెస్ కి ఎవరిచ్చారు .అణు ఒప్పందం కోసం ప్రభుత్వం కులినా పర్లేదు ,తెలంగాణా కోసం అలా కుదురదు ..మంత్రి పదవి కోసం రాజీనామా అంటే రెడీ ..తెలంగాణా కోసం అంటే కుదురదు .. మీ కొడుకు ప్రధాన మంత్రి కావాలి..మా తల్లులు కడుపు కోతకి ఏడవాలి..కుంభకోణాలు ,రాజకీయ ప్రయోజనాలు తప్పితే ప్రజలు,ప్రజల ప్రయోజనాల ధ్యాసే ఉంటె కదా..అంత గొంతెమ్మ కోరిక అడిగామా,చిదంబరం మాట్లాడిన రోజు మంచో చెడో మీకు తెలీదా ? ఇంత మంది ప్రాణాలు తీసే అధికారం మీకుందా? ప్రకటన మీ ఇష్టం,వెనక్కి పోవడం మీ ఇష్టం,కమిటీ మీ ఇష్టం,దాని రాత మీ ఇష్టం..మీ కమిటీ రిపోర్ట్ వినక ముందే మేము తేల్చి చెప్తున్నాం,మీ కాంగ్రెస్ కి తెలంగాణా కమిటి ఉరి శిక్ష ఖాయం చేసింది..ఇక్కడో 125 ఏళ్ళు మీ పార్టీ కొట్టుకపోవడానికి మీ చేతి రాత మీరే రాసుకున్నారు..
ఇదంతా మీకర్థంయ్యే ఇటలీ భాష కాదు..మీ పుత్రరత్నానికి ప్రేమ రావడానికి మాది లష్కరే తోఇబా లాంటి సంస్థ కాదు..
తప్పు చేతికి అధికారం ఇచ్చాక ప్రజలు ఈ మాత్రం అనుభవించాలి మరి..

Wednesday, November 10, 2010

తెలంగాణా అమాయకుని j.a.c..

నేను కదిలించే కవిత రాయలేను ..కనీసం కన్నీటి పాట తో పల్లె ని పలుకరించలేను..
నేను ఊకు డు దంపుడు ఉపన్యాసాలు ఇవ్వలేను..జిత్తులమారి రాజకీయవేత్తను కాను..
నేను తెలంగాణా వాదిని మేధావిని కాను...ఒంటి కన్ను తో మొసలి కన్నీరు కార్చలేను ..

నేను
పురుగుల మందు తాగి చావబోయే రైతును..
నా వంశం ఉరితాళ్ళకు వేలాడోద్దని విలపిస్తున్న అన్నదాతను..

నేను
మగ్గం తో జీవితం ఈడ్చలేక ఓడిపోతున్న చేనేత కార్మికుడిని..
నా బిడ్డల జీవితం ఈ చీకట్లో మగ్గిపోవద్దని వేడుకుంటున్న వాడిని..

నేను
ముంబాయి ,దుబాయి ,బొగ్గుబాయి...
ఈ చట్రం లో నలిగిపోయిన బతుకుల సజీవ సాక్షాన్ని..
బొగ్గు తవ్వి తవ్వి బుగ్గిపాలైన నేను
నా కోన ఉపిరి తో కొత్త తరానికి వేలుగునివ్వాలని చూస్తున్న వెర్రివాడిని ..


నా శ్రమ మీద పాట ఒకరిది ,నా కష్టం మీద ఆట ఒకరిది ,
నా చావు మీద ఓటు ఒకరిది ,నా శవం తో ఫోటో ఫోస్ ఒకరిది ..
నన్ను అమ్ముకోకన్నా,నా మీద వ్యాపారం చేయకన్నా..
అని అరిచి చెప్పలేని అసమర్థ బడుగు జీవిని..

ఎటు బోయి..
కదిలే చరిత్రను వీక్షకునిగా చూసి వదిలేయలేని వాడిని..
ఇది వందల తరాల తెలంగాణా బిడ్డల భవిష్యత్తుకు పునాదని తెలిసిన వాడిని..

"బలవంతుడే బ్రతుకుతాడు"అని డార్విన్ థి య రీ ..
"బతకడానికి బలవంతుడవ్వాలని" నా అనుభవం నాకు నేర్పిన థి రీ .
అందుకే ఖాళి కడుపుతో ,వంగిన నడుము తో..
నరాలను అదిలించి,బలాన్ని తెచ్చుకొని పిడికిలి ఎత్తాను..
అణిచివేత దెబ్బలు తిని తిని రాయినయ్యను..
ఇక ఈ రాయి..
సమైక్యవాదుల
కాలికి అడ్డం పడుతుందో,
కంట్లో నలుసవుతుందో,
నెత్తి పై బండవుతుందో..
కాలమే చెప్పాలి..
ముఖ్య గమనిక:
నా వెనుక ఎవరూ లేరు..నా j.a.c కి ఏ పేరు లేదు..
అయినా మీరు ముచ్చటపడితే..నాది..
"తెలంగాణా అమాయకుని j.a.c"

Monday, November 1, 2010

అస్తమించిందా.?.అవతరించిందా.?

రాష్ట్ర అవతరణ దినం విద్రోహ దినం గా మారిన చారిత్రిక పరిస్తితి బహుశ ప్రపంచం లో ఇదే మొదటి సారి కావొచ్చు..ఇది విద్వేషాలు పెంచాదనికో,లేదా కేవలం నిరసన తెలపడానికో వాడిన పదం కాదు..ఆ మూడు అక్షరాల పదం లో మూడు తరాల ఆవేశం ,అణిచివేత వినిపిస్తుంది,ఇవాళ అందరిలో కనిపిస్తుంది..

నా చిన్నప్పటి నుండి నేను చూసిన ఒకే ఒక అవతరణ దినోత్సవ వేడుక చంద్రబాబు హయాం లో ,నేను 7/8 తరుగతి చదువుతున్నప్పుడు,వరంగల్ లో పెద్ద కార్నివాల్ జరిగింది..మా వరంగల్ మునిసిపాలిటి కి కూడా తెల్ల సున్నం వేసి,లైట్స్ పెడ్తే ఆనందంగా చూసాను..బహుశ తెలంగాణా జిల్లలల్లో ప్రభుత్వ కార్యాలయాలు అలా మెరిసిపోతూ ఎపుడూ కనబడలేదేమో..ఆ రోజు ఆటలు,పాటలు ,మీడియా ఛానళ్ళు అంతా సరదాగా జరిగింది..నా చిన్న మెదడుకి సందేహం ప్రతి ఏడు ఇలా ఎందుకు జరగలేదు అని..చంద్రబాబు నాయుడు లేడు ఇంత ముందు కాబోలు అనుకున్న..
తర్వాత ఏడు నవంబర్ ఒకటికి ఉత్సాహంగా చూసా మళ్లీ వేడుకలు జరగుతాయని..ఉహు ఎక్కడా ఆ ఊసు లేదు,ఎవరి మధ్య ఆ మాట కూడా లేదు,నాకు తెలిసిన పెద్దవాళ్ళని అడిగా ఎందుకు ఈ సంవత్సరం కూడా జరగట్లేదు అని..ఎవరు సమాధానం ఇవ్వలేదు మౌనం గా ఉన్నారు..రాష్ట్ర అవతరణ దినం ,పొట్టి శ్రీరాములు త్యాగ ఫలం,అయినా ప్రజలలో ఇంత నిర్లిప్తత ఎందుకు అనేది నాకు అప్పుడు అంతు పట్టని విషయం .
ఇపుడు అర్థమవ్తుంది ,తెలంగాణా ఆ రోజుకే విద్రోహం అని భావించిందని..మౌనగా ప్రకటించారని..తెలంగాణా గొంతు మూగబోయింది మూడు తరాలు..లేదా గొంతు నలిపారు అనొచ్చు..కాని బాధ తెలుపడానికి భాష అక్కర్లేదేమో..రోజు బడి లో పాడిన మా తెలుగు తల్లి పాట ఏ రోజు పరవశం తో పాడిన గుర్తు మాకెవరికి లేదు.. అప్పుడు అగ్యానం లో కూడా అభిమానం కలగలేదు అంటే తెలంగాణా లో ప్రజలు ఎలా మొక్కుబడిగా,మనసు లేకుండా,బ్రతుకుతున్నారో సమైక్య రాష్ట్రం లో అర్థమవుతుంది..
మాకు గోదావరి తెలంగాణా లో ప్రవహిస్తుందనే తెలీదు..పొట్టి శ్రీరాములు కి సమైక్య రాష్ట్రానికి సంబంధం లేదన్నది తేలేదు..నిజాం గురించి ఊర్లో అమోమ్మలు తాతలు చెప్తే కొద్దిగా తెల్సు..స్వతంత్ర సమరయోధులు అంతా చీరాల ,గుంటూరు వల్లే ,తెలంగాణా లో ఒక్కరు కూడా ఎందుకు లేరు అనేది మా అమ్మకు చదువుకునే టప్పుడు
వేధించిన ప్రశ్న..నాకు శ్రీ శ్రీ కవితలు తెల్సు..దాశరథి పేరే తెలీదు ..అల్లూరి సీతారామరాజు సినిమా చూసా,కొమరం భీం పేరు కూడా ఎన్నడు వినలేదు..మా నాన్నకు సెక్రటేరియట్ లో ఎందుకు పోస్టింగ్ ఇవ్వరో ఎపుడూ అర్థంకాలేదు..అసలు మా ఊర్లో పొలాలు ఎందుకు ఎండిపోతాయో తెలీదు. మా ఊర్లలో ఎవరికీ ఉద్యోగాలు ఎందుకు రాలేదో తెలీదు..మా ముస్లిమ్స్ అందరు గుల్ఫ్ కెందుకు వలస వెళ్తారో తెలీదు ..మా లంబాడి తండాల్లో ఆడపిల్లను ఎందుకు అమ్ముకుంటారో తెలీదు .
మేము చదువు కున్నాం ఆంధ్రను , తెలంగాణా బతుకును చదవలేదు , ఐనా తెలంగాణా ఇవాళ తలకెక్కింది అంటే ఎంతటి వివక్ష జరిగుంటే ,అనుభావిన్చుంటే మా హృదయాలు పుస్తకాల నుండి,పాఠాల నుండి వాస్తవం వైపు ,ప్రజా చైతన్యం వైపు అడుగులేసుంటాయి ..మా సీనియర్ డాక్టర్లు కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పుకున్నారు ..మేము జీవితం అంత ఈ సమైక్య పాలన లో తీవ్ర వివక్షకు ,అవమానాలకు గురయ్యాం ..మా జీవితం ఐపోయింది ..మీ జీవితాలు మాల కాకూడదనే మా ఆరాటం ..అందుకే మాట్లాడ్తున్నాం ,పోట్లడుతున్నాం ..
తమకు అన్యాయం జర్గితే ఉరుకుంటారేమో కానీ బిడ్డలకు జర్గుతుంటే ఏ తల్లి,ఏ తండ్రి భరించలేరేమో ..అందుకే 20 ఏళ్ళ కిందటి మౌనం ఇప్పుడు లేదు..గొంతు కలపడమే కాదు ,గర్జించడానికి సిద్ధపడ్డారు ..
ఈ నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినం కాదు..రాష్ట్రం అస్తమించిన దినం..దేశం అంటే మట్టి కాదు ,ప్రజలని నమ్మితే ..ప్రజలు విడిపోయారు ,ఇపుడు మట్టే మిగిలింది ..మరి రాష్ట్రం ఇవాళ అస్తమించిందా ? అవతరించిందా? విజ్యులకు అర్థంకానిదేమికాదు..

Thursday, October 7, 2010

బతుకమ్మ..

కట్ల పూవులు మా కోమటి అక్కలు,
గోరింట పూవులు మా గొళ్ళ భామలు ,
చేమంతి పూవులు మా వడ్రంగి చెల్లెళ్ళు,
బంతి పూవులు మా బడుగు పిల్లలు.
తంగేడి పూవులు మా తెలగ కూనలు,
గునుగు పూలు మా దుదేకులపోల్లు ,
సన్నజాజులు మా సాకలి వదినలు ,
గుమ్మెడి పూవులు మా ఔసాలి పిన్నులు .
పువ్వు పువ్వు కో వర్ణం ,ప్రతి వర్ణం సువర్ణం;
కలగలిసి వెలిసిన బతుకమ్మ, తెలంగాణ కొంగు బంగారం.

ఇది నాకు తెలిసిన ,నేను ఊర్లో చిన్నప్పటి నుండి ఆడి పాడిన బతుకమ్మ.నా తెలంగాణా అస్తివం,తర తారలు గా అందిన సంస్కృతి,సంప్రదాయం..100 మంది కొడుకులు చనిపోతే,తపస్సు చేసిన ధర్మాన్గుడను రాజుకు స్వయంగా లక్ష్మి దేవి జన్మించిన కథ..నువ్వన్న బ్రతుకమ్మ అని బతుకమ్మ అని పేరు పెట్టిన కథ.ఇవాళ తెలంగాణా లో 400 మంది బిడ్డల మరణాలు,ఇవాళ ఉన్నవాళ్ళని బతుకమ్మా అనే చెప్పాలి..ఎడారి లో పూసే తంగేడి పూవు లా ఈ కష్టాలకు నిలదోక్కుకోమని చెప్పాలి..ఆ గౌరమ్మ పార్వతి దేవి రూపమై రాబోయే యుద్ధానికి పోరాడే ధైర్యాన్ని ఇవ్వాలి..ఇది సగటు తెలంగాణా వాడి ఆలోచన..ఇది జర్పుతమని ఒకరు..బహిష్కరిస్తామని ఒకరు లేని వివాదం తెచ్చిపెట్టారు..బిడ్డలు చచ్చిపోయి బాద లో ఉంటె పండగేంటి అని కొందరి వాదన ..మనిషి చనిపోయిన రోజే కర్మ కాండలు చేసి వచ్చిన కొడుకులు తినేవరకు మిగితావారు తినరు..ఇక్కడ ఆహారం ముఖ్యం అని కాదు..depression (నిరాశ,నిస్పృహ) లోకి ఆ కుటుంబం వాళ్ళు జారకుండా కాపాడుకోవడం..ఇది హిందూ సంప్రదాయం లో ఉన్న మానసిక శాస్త్రం..ఈ బతుకమ్మ పండక్కి కూడా కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని ఇంటికి పిలిపించుకొని చూసుకుంటారు,ఫలహారాలు పంపుతారు ..అదొక సహజమైన కోన్సిల్లింగ్..ఇవాళ తెలంగాణా లో ఇదే అవసరం..నిరంతర ఉద్యమం లేదు కానీ నిరంతరమైన ఆందోళన అందరిలో ఉంది..ఆది అధికమించలేని వాళ్ళు ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్నారు ..ఆ పల్లెల్లోకి ,పసి హృదయాల లోకి మన డాక్టర్స్ ని పంపి కోన్సిల్లింగ్ చేయలేం..కాబట్టి కనీసం జరిగేది జరగనివ్వాలి..ముందున్న డిసెంబర్ 31 ఏ ప్రమాదానికి తెరలేపుతుందో తెలీనపుడు,సమాజాన్ని వీలైనంత శాంతంగా ఉంచాలి..ఇది భాద్యత ఉన్న ఉద్యమకారులు ఆలోచించ వలిసి ఉంది..కాదని వితండ వాదం..ఎవరికో పేరు వస్తుందని చాదస్తం..అమ్ముడుబోయి మోగుతున్న స్వరం తప్పిన పాటలు..ఇవన్ని తెలంగాణా కి నష్టం చేసేదే కానీ లాభం చేసేవి కాదు..ఇంత పెద్ద పోరాటం ఒక పండగ జర్పుకోవల్న వద్ద అనే కాడికి దిగజార్చడం చాల పెద్ద నేరం,భాధ్య తా రాహిత్యం..
అమర వీరులకు గుర్తుగా ప్రతి బతుకమ్మ మీద దీపం పెట్టండి...వాళ్ళ ఆశయాన్ని గుర్తించండి..సమాజంలోకి ఇంకా లోతు గా తీసుకెళ్ళండి ...కూర్చున్న కొమ్మని నరకడం అవివేకం..

Saturday, September 18, 2010

పాశవిక సి ఐ ,చవట హొమ్ మినిస్టర్ ..


జాతీయ జెండా ఎగురవీయడానికి వెళ్ళిన విద్యార్థిని పై కుశైగూడ సి ఐ మనోహర్ రెడ్డి అసభ్య,అనైతిక,ఆటవిక ప్రవర్తన.. సెప్టెంబర్ 17 నిజంగా చూపించింది తెలంగాణకి విమోచన జరగలేదని..ఒక ఆడపిల్ల మీద ఇలాంటి చర్య జరిగితే,హుట హుటిన చర్యలు తీసుకోవాల్సిన హొమ్ మినిస్టర్ ఒక చవట,చచ్చు,చెవిటి వ్యక్తీ గా వ్యవహరించారు..ఆమె ఒక స్త్రీ అవడం ,తెలంగాణా వ్యక్తీ కూడా అవ్వడం నిజంగా సిగ్గుచేటు..ఆ సి.ఐ సిగ్గులేకుండా నేను సమైక్యవాదిని అందుకే చేశా అని చెప్పుకుంటుంటే,సమైక్యమంటే ఇదే అని సీమంధ్ర నాయకులు వంత పాడుతున్నారు..ఖండించాల్సింది పోయి వాడిని కాపాడుతున్నారు..ఉస్మానియా లో అమ్మాయిల మీద జరిగినపుడు సి.పి సీతా రామంజనీయులు ని బదిలీ చేసారు,విజయవాడ లో రౌడీ ల సెట్టేల్మెంట్లు చేస్తూ సుఖంగా ఉన్నాడు.అప్పుడన్న విచారణ ఎప్పుడో అటకెక్కింది.మళ్లీ ఇప్పుడు ఈ సి.ఐ ని బదిలీ చేసారు..అంటే తెలంగాణా స్త్రీ ల మీద దాడులు చేయండి,మేము మిమ్మల్ని రక్షిస్తాం అని ఈ ప్రభుత్వం చెబుతుందా..అసలు ఇలాంటి వాతావరం లో డిసెంబర్ వరకు మాత్రం మేమెందుకు కలిసి ఉండాలి .. ప్రతి దాడి చేయడం తెలంగాణా కి చాతగాకన..

Friday, September 10, 2010

తెలంగాణా ఓ పండోర..

ఇవాళ కొమరం పులి సినిమా టైటిల్ మీద గొడవ అవుతుంది,కొమరం భీం లాంటి పోరాట యోధుని పేరు మీద ఓ కమర్షియల్ మాస్ మసాల సినిమా ,తిట్టిపోయడం లో తప్పేం లేదు,కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఒక ప్రాంతం వ్యతిరేకిస్తే మరో ప్రాంతం ఆహ్వానిస్తుంది..సమైక్యత అంటే ఇదేనేమో కాబోలు..
చిరంజీవి పిల్లి,అల్లు వారి చింపాంజీ,పవన్ కోతి, అని పేర్లు పెట్టి సినిమాలు తీస్తే అర్థమవ్తుందేమో మనోభావాలు అంటే ఏంటి,పేరు పెట్టడం అంటే ఏంటి..అని..

ఒక పోతిరెడ్డిపాడు మీదనో ,పోలవరం మీదనో ఇరు ప్రాంతాల వారు వాదించుకుంటున్నారు అంటే నీటి సమస్య బతుకు సమస్య..కాని తెలంగాణా నేత పేరు ని అవమానిస్తే ఆహ్వానించడం ఏమని అర్థంచేస్కోవాలి.. తెలంగాణా విమోచన దినం ఆంధ్ర ప్రాంతం వ్యతిరేకిన్చవలసిన అవసరం నిజంగా ఉందా? వారికీ వారి హక్కులకు ఎమన్నా భంగం కలుగుతుందా ..
పోలీసు ఆక్షన్ చేయించి తెలంగాణా ని విముక్త పరచిన సర్దార్ వళ్ళభాయి పటేల్ విగ్రహం పెట్టకూడదు కాని తెలంగాణకు అన్యాయం చేసిన ఓ సైతాను విగ్రహం తెలంగాణా వాడ వాడ న పెట్టాలని ప్రయత్నిస్తే,రాళ్లు విసరక పూల మాలలు వేస్తారని ,వేయాలని ఎందుకు అనుకుంటారు?

వై.ఎస్ బ్రతికుండగా తెలంగాణా కి నీళ్ళు ఇవ్వలేదు ,నిధులివ్వలేదు,హక్కులివ్వలేదు,బతకనివ్వలేదు,భూములు కబ్జా, ఇవన్ని చాలదన్నట్టు మధ్య తరగతి వాడు అతి కష్టంగా నిలదోక్కున్నది కేవలం కష్టపడి ఐ.టి ఉద్యోగాలు చేస్కుంటూ..ఆలాంటి ఐ.టి ని సర్వనాశనం చేసారు..సత్యం కంప్యూటర్స్ పైకి తెలిసిన కథ వేరు,జర్గిన కథ వేరు..రాజ వారు ముచ్చటగా 500 కోట్లు రెండవ దఫా ముఖ్యమంత్రి కావడానికి 2009 election ప్రచారానికి రామలింగ రాజు ని ఇవ్వమని ఆదేశించారు..కుదరదని విన్నవించుకుంటే ,గెలిచిన వెంటనే యువరాజ వారు దేహ శుద్ధి చేసారు..దానితో పులి సవారీ చేయలేనని సత్యం వెనుక అసత్యం బయటపెట్టి హ్యాపీ గా niims కెళ్ళి పడుకున్నారు..భారత దేశ it వ్యవస్తకే మాయని మచ్చని తెచ్చిపెట్టారు..షేర్ ల లో లక్షల మంది మునిగారు,వేల మంది ఉద్యోగాలు పోయాయి,అస్తవ్యస్తం అయింది..ఇందులో ఆంధ్ర ప్రాంతం వారు నష్టపోయారు ,తేడ ఏంటంటే ఇక్కడ ప్రజలు చైతన్య పడుతున్నారు,అక్కడి వారు ఇంకా ఆ మాయ లోనే ఉండిపోయారు..

అంతెందుకు ఇవాళ హైదరాబాద్ మాది మాది అని ఇంతగా అందరు గొంతు చించుకుంటున్నారు..హైదరాబాద్ లో పరిశ్రమల కాలుష్యానికి కూరగాయలు ,పండ్లు,భూమి,నీళ్ళు ప్రతీది ప్రాణ సంకటం గా మారింది..ఒక్క ప్రమాదం చాలు హైదరాబాద్ భారత దేశ చరిత్ర లో మరో భోపాల్ అవుతుంది..ఆ రోజు కాలుష్యం ప్రాంతాల వారిగా చంపదు..మోహన్ బాబు కి ,చిరంజీవి కి,చంద్ర బాబు కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వదు..ఇవాళ చేసే వితండ వాదం రేపటి కి ఎంత ప్రమాదమో ప్రజలు గమనించట్లేదు..

ఈ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం లో నాశనం అయ్యాం అని తెలంగాణా వాల్లంటుంటే ,మేమేం బాగుపడలేదు అని సీమంధ్ర వాల్లంటున్నారు ,మరి ఈ సమైక్య రాష్ట్రం ఇన్ని ఏళ్ళు గా సాధించిన్దేంటి ?ఎవరిని ఉద్దరించిందని ఇంకా కలిసుండాలి?
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే సీమంధ్ర ప్రజలకు నిజంగా ఒరిగేదేంటి?కబ్జాదారుల ఆస్తులు కాపాడటానికి ప్రజలు,విద్యార్థులు ఉద్యమిన్చాలా? మా కన్ను గుడ్డిడైతే ,మీ కన్ను మెల్లదైంది,అంతకుమించి ఆంధ్రప్రదేశ్ సాధించింది ఏం లేదు.

తెలంగాణా ని ఒక పండోర దీవి ని చేసారు..అణువణువునా ఖనిజాలు ఉన్న భూమి ని దోచుకోవడమే కాక,ఇక్కడి ప్రజల సెంటిమెంట్స్ మీద అణిచివేత చేసారు..చేస్తున్నారు..ఇలాంటి కలిసుండే సిద్ధాంతాన్ని ప్రపంచం లోని ఏ ప్రాంతం ఒప్పుకోదు.. ఏ జీవజాలం ఒప్పుకోదు..చీమ కూడా దాని పుట్ట మీద కాలేస్తే తిరగబడి కుడుతుంది ,మనిషి బరువు కి నేనెలాగు చస్తా కదా అని పోరాటం ఆపదు..తెలంగాణా అంతే తీవ్రంగా తిరగబడుతుంది..మనషి ప్రక్రుతి దైవం మూడు విడదీయలేనివి .. ఆ సినిమా లో కథ కల్పితం కాని అంశం వాస్తవం..తిరగబడే రోజు ప్రక్రుతి దేవుడు కూడా తెలంగాణా సామాన్య మనిషికి తోడుగా నిలబడుతారు ..

Saturday, July 31, 2010

భాద్యత ఎవరిది?

ఉప ఎన్నికలు ముగిసాయి,అందరం ఆకాంక్షించిన విధంగానే 12 చోట్లా కూడా రాజీనామా చేసిన వారినే గెలిపించారు..
సంబరం ఒక్క పూట కూడా నిలువలేదు..ఉస్మానియా లో ఇశాంత్ రెడ్డి ఆత్మహత్య..d.s ఓడిపోతే ప్రాణాలిస్తా అని మైసమ్మ తల్లికి మొక్కు..నమ్మకం మంచిదా కాదా అని పక్కకి పెడితే..అసలు d.s గెలుస్తాడా ఓడుతాడా ? ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది మన పిల్లల మనసులో?ఇంత తెలంగాణా ఉద్యమం కేవలం డబ్బుకి ,అధికారానికి,బెదిరింపులకి లొంగుతది అనుమానం ఎందుకొచ్చింది? మీడియా సృష్టి కొంతవరకి కారణం..నిజామబాద్ ప్రజల మౌనం,మొహమాటం,మీమాంస కూడా కారణం అని చెప్పక తప్పదు..

ఎలుగెత్తి తెలంగాణా కే వోట్ వేస్తాం అని రోడ్ల మీదకి రాలేదు..అత్మస్త్యర్యాన్ని ఇవ్వలేదు..కనీసం d.s సభలని బహిష్కరించలేదు..ఆ పెట్టె తిండిని తిరస్కరించలేదు..డబ్బులు తీసుకోకుండా ఉండలేదు..మౌనం వహించారు..వోట్ వేస్తె చాలనుకున్నారు..ఆ వోట్ వేస్తారో లేదో అని ఒక చాకలి శ్రీనివాస్ మరణించాడు..ఓ ఇషాంత్ రెడ్డి మొక్కు తీర్చుకున్నాడు..చావడం తప్పే..కాని పోరాటం లో మీతో మేమున్నాం అని ప్రజలు ధైర్యం ఇవ్వకపోవడం తప్పే..ఒక్క ఉద్యోగ సంఘం,ఒక్క కుల సంఘం..ఒక్క ఇల్లు..ఒక్క వాడ ..తెగింపు చూపించి ఉంటె ఈ ఇద్దర్ని కాపడుకునేవాళ్ళం..ఇప్పటికైనా ప్రజలు తెల్సుకోవాలి..
మీ మౌనం మీ బిడ్డలకి శాపం అవ్తుంది..
ఆత్మహత్యల్ని ఆపడం ఎవరి తరం కాదు..ప్రజలు కదిలి రాకుంటే..మేలుకోకుంటే..మీకు మేమున్నాం బిడ్డ,ముందు ఎనకాల కాదు,మీతోనే ఉన్నాం అనే చిన్న భరోసా ఇప్పటికన్నా ఇవ్వకుంటే..

ఉద్యమకారులకి కూడా ఒక మాట యుద్ధం లో చావంటే భయం ఎలా ఉండకూడదో ,ఓడిపోతాం అని భయం కూడా ఉండకూడదు..గెలుస్తాం అని తెగించి సింహలుగా పోట్లాడితేనే తెలంగాణా..లేకుంటే రోజుకో తల్లికి కడుపు కోత..
ద్రోహులు పదవుల్లో నాలుగు ఏళ్ళ కంటే ఎక్కువ ఉండరు..కానీ మీ భవిష్యత్తు 40 ఏళ్ళు ..ఎవరో భాద్యత తీసుకోవడం కాదు ముందు మన పోరాట భాద్యత,మన ప్రాణాల భాద్యత మనం తీసుకుందాం ..

Wednesday, June 23, 2010

మిగిలేది ఏదైనా మనది..

ఎన్నికల నగారా మోగింది..అన్ని పార్టీలు పోటి కి సిద్ధం..తెలంగాణా తెచ్చేది నేనే అని d.s (d.శ్రీనివాస్) గారి వాదన.
తెలంగాణా తెచ్చేది ,వచ్చేది నాకు తేలీదు కాని,ఒక సామాన్య తెలంగాణా బిడ్డ గా pcc అధ్యక్షుల వారిని అడగాలనుంది..మిమ్మల్ని ఇన్ని ఏన్ల నుండి నిజామబాద్ అక్కున చేర్చుకుంది,తెలంగాణా పెంచి పోషించింది,మీరు మాత్రం తెలంగాణా తల్లిని తాకట్టు పెట్టారు..ఉస్మానియా చెల్లి ని వీధిపాలు చేసారు..మానుకోట తమ్మున్ని తుపాకీ పాలు చేసారు..
మీ ఇంటి అడబిడ్డల్ని అరాచకంగా ఆంధ్ర పోలిసిలు అవమానిస్తుంటే ,ఆ రాత్రి కళ్ళు లేని దృతరాష్ట్రుడై కుర్చున్నారా..లేకుంటే మా ఆత్మగౌరవాన్ని సీమంద్రులకి తాకట్టు పెట్టి pcc పదవి పొందారా? మిమ్మల్ని గెలిపిస్తే వచ్చేది తెలంగాణా కాదు..ఇంటింటికి ఒక అమాయకుని శవం,గంట గంట కి అడబిడ్డకి అవమాన భారం,మునిగిపోయే భద్రాచలం...
ఇంకా
మోసం చేయండి..తెలంగాణా చేతుల్ని నరికి అందలం ఎక్కండి..
కాంగ్రెస్ ఏం చేస్తే మేమదే చేస్తాం..రెండు నాల్కెల వారి వాదన..ఇచ్చేది,తెచ్చేది,నాన్చేది,ఆపేది అన్ని కాంగ్రెస్ ఏ,తెలంగాణా లో ఈ సారి చచ్చేది కూడా కాంగ్రెస్ ఏ,మరి ఆ జాబితా లో చేరడానికి మీరు సిద్ధం అయతే మాకు అస్సలు అభ్యంతరం లేదు..మీకు తెలంగాణా ఇస్తే అభ్యంతరం లేదు..సమైక్యాంధ్ర ఉంటె నష్టం లేదు..మీకంటూ ఒక విధివిధానం లేదు..అందుకే ప్రజలకి మీ పార్టీ అస్సలు అవసరం లేదు..అమరవీరుల కుటుంబాలకి election టికెట్లు ఇస్తాం.. మా అమరత్వాన్ని ఒక్క టికెట్ తో కోనేస్తారా?పోనీ మీరు రాజీనామా చేసిన చోట్లు కాదె?అత్త సొమ్ము అల్లుడు దానం చేసే తంతు.
.కొన్ని వాదాలు వినిపిస్తున్నాయి రాజీనామా చేసిన వాళ్ళు నిలబదోడ్డు.ఇస్తే అమరుల కుటుంబాలకి టికెట్ ఇవ్వాలి,లేదా election ఏ జరగొద్దు..రాజకీయ సంక్షోభం మంచిదే కాని జరిగే పరిస్థితులు లేవు..రాజీనామా నిజంగా పెద్ద త్యాగం కాకపోవచ్చు..కానీ ఒక మార్గదర్శనం..ప్రజలు హత్తుకున్నారు,గుండెల్లో పెట్టుకున్నారు,మమ్మల్ని గెలిపించారు..ప్రజావాణి తెలంగాణా నే అని చాటి చెప్పడానికి..ఎన్నికల తో తెలంగాణా రాదు..కానీ ఎన్నికలే ఓడిపోతే తెలంగాణా ఒక తీరని స్వప్నం లా మిగిలిపోయే ప్రమాదం ఉంది..
ఇక చిరంజీవి గారు గుర్రం ఎక్కి షికారు పోయినపుడు తెలీలేదు ..ఇప్పుడు కనిపించిది పార్టీ తెలంగాణా లో మూసుక పోయింది అని..ఊరుకుంటారా సమైక్యాంధ్ర అంటే తెలంగాణా కి వ్యతిరేకం కాదని వింత,వక్ర భాష్యం..వోటు,నోటు తప్పితే ఈయనకు ఇటు తెలంగాణా తెలీదు , అటు ఆంధ్ర అర్థంకాదు..ఇక్కడ తన్నాలి అక్కడ తరమాలి..
మూడు తరాల ఉడిగం చాలు..ఈ తరం ఈ యుద్ధం చేయకపోతే..రాబోయే తరం కట్టుబానిసలుగా,పుట్టు బానిసలుగా మిగుల్తారు..శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ మరో చిదంబర రహస్యం లా ఉండొచ్చు..కాంగ్రెస్ మరో మోసానికి సిద్ధం కావొచ్చు..
కాని ఇవాళ అర్థం కావాల్సింది ఒకటే IF CONGRESS WANTS TO KEEP UNITED ANDHRAPRADESH
THEN IT SHOULD GET READY TO KILL 4CR OF TELANGANA PEOPLE..ఉంటె స్వరాజ్య తెలంగాణా ఉండాలి లేకుంటే స్మశాన సమైక్యాంధ్ర మిగులాలి..ఆంధ్రుల చరిత్ర రేపటి మానవ ప్రపంచం ఈసడిన్చుకోవాలి..
తెలంగాణా రాదని తెల్సిన క్షణం ఒక కెసిఆర్ కాదు..4 కోట్ల తెలంగాణా ఆమరణ దీక్షకి కూర్చోవాలి.. రోజుకో రైతు ఆత్మహత్య..దినానికో చేనేత కార్మికుని మృతి..ఆశ కోల్పోయే గుల్ఫ్ బాధితుడు..భవిష్యత్తు లేని విద్యార్థి లోకం..వేధింపు చర్యలతో ఉద్యోగి వర్గం..గ్రీన్ హుంట్ లో అసువులు బాసే అన్నల పోరాటం..రోజుకో పిరికి చావు కన్నా,ఒకే రోజు ఒకే యుద్ధం..విజయమో వీరస్వర్గమో..అందరిది..మిగిలేదేదైనా మనది..

Friday, May 28, 2010

నరం నరం ఒకే స్వరం ,సమరమే ఇక మా పథం .

అనుకున్నట్టే యువరాజ వారు (వై.యస్ జగన్)ఓదార్పు యాత్రకు బయలుదేరారు ఇంటర్సిటీ ఎక్ష్ ప్రె స్స్ లో ..కొండా దంపతులు ,పుల్ల పద్మావతి గ్రూపులు మహుబ్బాద్ కి చేరుకున్నాయి స్వాగతం పలకడానికి...పాపం వారు అనుకోనివే కొన్ని జరిగాయి...జగన్ యాత్రకి అడుగడుగునా నిరసనలు,కొన్ని చోట్ల పట్టాలు పెకేస్తే,కొన్ని చోట్ల వెలది మంది పట్టాల మెడ పడుకున్నారు,కొంతమంది రాయి పెడ్తే,కొంత మంది చెట్లు నరికి అడ్డంగా వీసారు,నినాదాలు ఇచ్చారు,రుబ్బెర్ తయరు లు కాల్చారు.యాత్ర ను వంగపల్లి లో అపకా తప్పలేదు..ఇటు మహుబ్బాద్ లో కొండా అనుచరుల భీభత్సం,రాళ్ళతో తిప్పి కొట్టిన తెలంగాణా జనం..కొండా మురళి స్వయం గా కాల్పులు జరిపి ఒకరి మృతికి కారణం అవ్వడం..దీనితో అత్తకి అల్లుడిని అదుపు లోకి తీసుకోవడం తప్పలేదు..

అందరు వద్దని చెప్పినా పెడచెవిన పెట్టి ఓ మూర్ఖుడు దండయాత్ర తలపెట్టాడు,కాని ప్రభుత్వం ముందస్తుగా అరెస్స్ట్ చేయకుండా అలసత్వం చూపడం క్షమించలేనిది..ఎందుకంటే ఇంతమంది తెలంగాణా ప్రజల ప్రాణాలు పోవడానికి ఈ అలసత్వమే కారణం.తెలంగాణా m.p కో నీతి ,సీమంధ్ర m.p కి మరో నీతి..సమైక్యాంధ్ర లో అడ్డు అదుపు లేని ద్వంద్వ ప్రమాణాలు.ఈ మూర్ఖున్ని సమర్థించే మర్రిన్ని మూర్ఖపు మూకలు మీడియా ముందుకొచ్చి చిన్డులేస్తున్నాయి..
ఇలాంటి పరిస్థితుల్లో రేపు శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ ఇచ్చినా దాన్ని ఎవరన్నా ఖాతరు చేస్తారా అనేది నేడు తెలంగాణా ముందున్న పెద్ద ప్రశ్న.అందుకే ఓరుగల్లు సమర ఢంకా తో తెలంగాణా తెలిపింది ఇక మేము సై అంటే సై ,ఇక మా నరం నరం ఒకే స్వరం ,సమరమే ఇక మా పథం .

Tuesday, May 25, 2010

ఓదార్పు మాకొద్దు..!

తెలంగాణా చైతన్యాన్ని ,తెలంగాణా వాదం బలాన్ని,ఈ ఆత్మగౌరవ పోరాటాన్ని ఎలా అభినందించాలో అర్థంకావట్లేదు.
రాష్ర సాధనకై అసువులు బాసిన అమరులు నిజంగా ఇవాళ సంతోషిస్తారు,వాళ్ళు మరణించినా ,వాళ్ళ వాదం,భావజాలం బ్రతికిఉన్నన్దుకు.ఆర్థిక సాయం పేరుతో తెలంగాణా లో సమైక్య వాణిని వినిపించడానికి వస్తున్న జగన్ ఓదార్పు యాత్ర,దానికి తాన తందానా అంటున్న కొంతమంది చంచాలు..గొప్పను కొని పోయారు తెలంగాణా పల్లెల్లోకి..డబ్బులిస్తాం అని..వీళ్ళని కనీసం కలవడం ఇష్టం లేని పృథ్వీ తల్లితండ్రులు,ఇంటికి తాళం వేసి ,ఉత్తరం పెట్టి వెళ్లారు,ఇస్తే నా బిడ్డ ప్రాణాలు ఇయ్యండి,లేకుంటే తెలంగాణా ఇవ్వండి ఆని..మరో రాజ్ కుమార్ కుటుంబం తెలంగాణా ఇవ్వండి ,ఆంధ్ర వాడి దగ్గర సాయం తెసుకోము ఆని తెగేసి చెప్పారు..తిరస్కరించారు..కొండ సురేఖ గారు ఇంకా చేసిన తప్పుకి నాలుక కర్చుకున్నారో లేదో..జగన్ గారు ఖంగు తిన్నారో లేదో..కాని తెలంగాణా తల్లితండ్రుల త్యాగానికి తెలంగాణా అంతా సలాం పలుకుతుంది..
అటు వరంగల్ బంద్,ఇంకో వైపు ysr విగ్రహం ద్వంసం ,మరో వైపు చలో మహబూబాబాద్,జగన్ మీద సొంత పార్టీ తెలంగాణా నేతల ఆగ్రహం..నేను పట్టుకున్న కుందేలుకి మూడే కళ్ళనే యువరాజావారి మంకుపట్టు...కోరి అవమానాల పాలైతా అంటే ఎవెరెందుకు ఆపడం..రానివ్వండి...నిన్న లేని ధైర్యం ఇవాళ ఉంది..నేతలు రాతలు మరకున్నా ప్రజా శక్తి లో కొత్త మార్పు చేకూరింది..ఇపుడు నిలదీస్తారు ,ఉతికి ఆరేస్తారు ఆని నమ్మకం ఉంది.. ఇపుడు పోరాడితే పోయేది ఏమి లేదు ,ఆంధ్ర బానిస సంకెళ్ళు తప్ప..

Thursday, May 13, 2010

సింహాలు..గుర్రాలు..ప్రజా పథాలు..ఓదార్పు యాత్రలు..నిట్టూర్పులు.

ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలు లేకున్నా,వడగాల్పులు వీస్తున్నా ,ఎండనక,కష్టమనుకోక పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నాయి.ముందుగా బాలకృష్ణ సింహ సినిమా హిట్ యాత్ర,పార్టీ అధ్యక్ష పదవి ముందు ముందు తెస్కోవచ్చు అని సూచించడం,చంద్రబాబు సై అనడం,ఇప్పుడైతే రాజ్యసభ కెల్త ,ముఖ్యమంత్రి పదవి ఇప్పుడే అవసరంలేదని చేపుకోవడం...బాలకృష్ణ గారి సినిమా కంటే ఈ కత కొంచం ఆకర్షనీయంగా ఉన్నా.. బాలకృష్ణ గారికి ,చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆశలు ఉన్నాయి ,తెలంగాణా జనాలు మల్లి మల్లి వేర్రోల్లై వీళ్ళకి వోట్ వేస్తారు,గెలిచేస్తారు,పదవులు పంచుకునే పనిలో మునిగిపోయారు..వెర్రి జనం విస్తు పోయి చూస్తున్నారు.

మరో సినిమా స్టార్..చిరంజీవి..ఈయన రాజకీయాల్లోకి వచ్చినా నటించడం వదలట్లేదు ,రాజకీయం నేర్వట్లేదు..ఈల వేస్తె అభిమానికి క్లాస్..గుర్రపు స్వారి...పోలవరం మీద ప్రత్యేక ప్రేమ..దాని మీద పోరాటం..అక్కడి జనాలు అందలం ఎక్కిస్తున్నారో లేదో తెలీదు కాని ,ఇక్కడి జనాలు గాడిద మీద ఎక్కించి స్వారి చేయిస్తున్నారు..ఈయన్ని విమర్శించడం కూడా వృధా ,ఎందుకంటే తెలంగాణలో prp అంటే ప్రజలు లేని పార్టీ.ఇక్కడ తాగడానికి గుక్కెడు నీళ్ళు దొరకక ప్రజలు అల్లాడుతుంటే అక్కడ మూడో పంటకు వేసే ప్రాజెక్ట్ మీద ఈయన ఏనామాలిన ప్రేమ.. జనాలు అసహాయులై ఈ నాటకం చూస్తున్నారు..

రోశయ్య గారి ప్రజాపథం,జగన్ గారి ఓదార్పు వ్రతం..పాలకపక్షం కాంగ్రెస్ ఏ ,ప్రతిపక్షం కూడా కాంగ్రెస్ ఏ.తెలంగాణా ఇచ్చేది నేషనల్ కాంగ్రెస్ ,తెచ్చేది తెలంగాణా కాంగ్రెస్,ఆపేది ఆంధ్ర కాంగ్రెస్..ఈ మాయాబజార్ నాటకం కాంగ్రెస్ ఇప్పట్లో ఆపేలా లేదు..ఉప ఎన్నికల్లో వీళ్ళని గెలిపిస్తే తెలంగాణా కు బలం వస్తుందట పొన్నం గారి వ్యాఖ్య.. పదవులకు అమ్ముడుబోయే గొప్ప గొప్ప నాయకులు ఈ తెలంగాణా గడ్డ మీద ఎందుకు పుట్టారా అని జనాలు ఈసడించుకున్న వీళ్ళకి వినిపించదు ,కనిపించదు..

ఇంత వాడి వేడి నాటకం జర్గుతుంటే జనాలు నిట్టుర్పులకి పరిమితమయ్యారు..ఎందుకంటే ప్రజాస్వామ్యం లో అతి బలహీనమైన జీవులు ప్రజలే...ఈ సారి ఉపఎన్నికల్లో వోటు ని వాడుకుంటారో,అమ్ముకుంటారో,తెలీదు కానీ ఈ నేల మీద పుట్టబోయే బిడ్డల భవితవ్యం ఏ తేరుకోలేని నిశీధి లోకి నేట్టివేయబడుతుందో ఆలోచించుకోవడానికి భయం గా ఉంది..

Friday, March 5, 2010

తప్పటడుగులు..తడబాట్లు..


తెలంగాణా ఒక పద్మవ్యూహం లో ఇరుక్కపోయింది,తెరాస ఎటు తేల్చుకోలేని అర్జుని లా యుద్ధ భూమి లో నడుమ నిల్చొని ఉంది..రానున్న బై ఎలెక్శఁన్స్ లో అమరవీరుల కుటుంబాల నుండి నిల్చోబెట్టాలని మనవాళ్ళే లేవనెత్తారు..దానిని కాంగ్రెస్, తె దే పా చాల బాగా వాడుకుంటున్నాయి..అసలు రాజకీయ పార్టీల నిజాయితీ అడిగే ముందు,నేను తెలంగాణా వాదుల నిజాయితీ ని ప్రశ్నిస్తున్న?తె రా స ను రాజీనామా చేయమంది మనమే,ఇపుడు చేసినవాళ్లకి నష్టం కలిగించే ప్రతిపాదనలు చేస్తే ,రేపు మనకు దిక్కెవరు?అసలు ఈ చావులకు కారణం తె దే పా ,కాంగ్రెస్ పార్టిలు కదా,వాళ్ళకి సిగ్గు లేదు సరే మనకేమైంది ఆ ప్రతిపాదనలు ఛీ కొట్టాల్న ,తిట్టిపోయల్న ఎందుకు మౌనం గా ఉన్నాం.ప్రజలే అమ్ముడుబోతే ప్రతినిధులు అమ్ముడుబోరా.?
శ్రీ కృష్ణ కమిటి కి అనివార్య కారణాల వాళ్ళ అందరం మన అభిప్రాయాలు చెప్పల్సోస్తుంది..రేపు కలిసుందామని అది రిపోర్ట్ ఇస్తే మన పరిస్థితి ఏంటి..మన ఉద్యమాన్ని మన ప్రజలే నమ్మరు,పోనీ నమ్మినా ఆంధ్ర వాళ్ళైతే ఈ రిపోర్ట్ ఆధారంగా మన పోరాటం కొట్టిపారేయరా?జరగబోయే పెద్ద ప్రమాదాలను ముందు పెట్టుకొని మనం ఇపుడు కుల పంచాయితీలు ,శవ రాజకీయాలు చేస్తున్నాం..అందరు కాదు కొందరే కానీ దాని ప్రభావం తెలంగాణా మీద ఉంటది..
ఇపుడు జస్టిస్ శ్రీ కృష్ణ గారు చెప్పారు డిసెంబర్ 9 చిదబరం చేసిన ప్రకటనను మనమే తప్పుగా అర్థం చేస్కున్నం అట..
we are initiating the process of telangana and appropriate resolution will be passed in assembly
ఇందులో పరిశీలిస్తాం అని కానీ,కమిటి వేస్తాం అని కానీ ఇకడ లేదే?మనన్ల్ని మళ్లీ వేర్రోల్లని చేస్తుంటే ఎందుకు పడుతున్నాం?
ఇవాళ కావాల్సింది డిల్లి వైపు చూపులు కాదు,మన గల్లి గల్లి లో,ప్రతి గుండె లో ఉద్యమ నిర్మాణం,తెగింపు.కాంగ్రెస్ ని
తె దే ప ను ఎదురించి చీల్చి చెండాడే తెగువ..పార్టి కొట్టుక పోతదంటే కాంగ్రెస్ ఏ దిగోస్తడి,100 సీట్లు మనకు చేతిలో ఉంటె స్టేట్ లో ఇంకా సమైక్య ప్రభుత్వం ఏర్పడే అవకాశం రాదు..కనీసం మన ప్రయోజనాలను కోల్పోము..కొన్నైనా సాధించుకుంటాం..తె రా స విలీన రాజకీయం వదిలేసి మొత్తం telangana భవిష్యత్తుకై మానిఫెస్టో ని రూపొందిన్చుకుంటే మంచిది,లేకుంటే కనీసం బి జే పి ముందుకొచ్చినా పర్లేదు..ఇది రాజకీయం ,ఉద్యమం అడవుల్లో కాదు ,ఇవాళ హైదరాబాద్ లో జరగాలి ,ఆయుధాలతో కాదు పిడికిలి తో,ప్రతి ఇంటికి ఒక మనిషి telangana సాధనకు అన్కితమౌతు,10 జిల్లాల telangana కు ఒక లక్ష మంది సైనికుల ను తయారుచేస్తు..
दम है कितना दमन में तेरे, देखा है !ओउर देखेंगे !
हमला चाहे कैसे भी हो!लड़ना है !ओउर लड़ेंगे!

Monday, February 22, 2010

ఆంధ్ర చావులు నాగరికం..తెలంగాణా చావులు ఆటవికం..


మా యాదగిరి కాల్చుకొని చచ్చిపోయాడు,తల్లి లేదని కాదు,తండ్రి లేడని కాదు,తెలంగాణా రాలేదని.ఒక అనాధ ఆశ్రమం లో పదవ తరగతి వరకు చదివాడు.హొటెల్ లో కాషియర్ గా పార్ట్ టైం చేస్తూ ,ఇంటర్ చదువు కుంటున్నాడు,అంతే కాదు ఆ ఆశ్రమం లో అనాధలకు అండగా నిలిచాడు.అగరుబత్తులమ్మి అంధులకు ఆసరా గా నిలిచాడు.తెలంగాణా పోరాటం లో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాడు,పోరాడాడు.ఛలో అసెంబ్లీ లో పాల్గొన్నాడు,ఆత్మాహుతికి సిద్ధ మయ్యే వచ్చాడు.
ఆ ఉత్తరం చదువుతుంటే,ఆ అమాయకత్వానికి,ఆ బాధకు కరుగని గుండె ఉండదు,తెలంగాణా లో ఏడవని కన్ను ఉండదు.
ఇంత చేసినా తను వోట్ వేసిన సబితమ్మ గుండె కరుగలేదు,ఆ కాంగ్రెస్ నేతల మనసు మారలేదు.సరికదా సీమంధ్ర నేతలు అసలు అతను విద్యార్థి కాదని కొట్టిపారేశారు.అంతటి అహంకారం,అంతులేని కరుడత్వం.
ఒక్క పొట్టిశ్రీరాములు చచ్చిపోతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి,ఆయన మీద నాన్ డీటైల్ మేము తర తరాలు చడువాలి.కాని మా సాయుధ పోరాట చరిత్ర చదువొద్దు.ఎందుకంటే ఆంధ్రా వాళ్ళ చావులు నాగరికం,తెలంగాణా వాళ్ళవి ఆటవికం..మహారాష్ట్ర లో కర్ణాటక లో తెలంగాణా విమోచన దినం చేస్కోవచ్చు కానీ తెలంగాణా లో కూడదు ,ఎందుకంటే మాకు విమోచన రాలేదు,మేమింకా ఈ ఆంధ్రా పాలకులకు బానిసలం. మా విద్యార్థులు మరణాలకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నే కారణం,చాలావరకు తె దే పా దోరణి కారణం.
ఇంకెందుకు శాంతి మార్గం,ఒక్క యాదగిరి ఎందుకు చావాలి,ఒక్క శ్రీకాంత్ మరో వేణుగోపాల్ ఎందుకు మరణించాలి,ఇవాళ తెలంగాణా అందరి ఆశయం ,మరణమే శరణ్యం అయతే అది అందరం కలిసే చేయొచ్చు,పోరాటమే మార్గం అయతే మరో సాయుధ పోరాటం కి మార్గం వేయొచ్చు.మన పెద్ద మనసు మన బిడ్డల ప్రాణాలను,ఆఖరికి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది.ఇంకా ఉపేక్షించి లాభం లేదు.వెనకటనే గాంధీ ఇక్కడ సత్యాగ్రహం కూడదని హుకుం జారి చేసాడు,ఒంటరులం,నేలను రక్తం తో తడిపి సాధించుకున్నాం.ఇవాళ మళ్లీ ఒంటరివాళ్ళం,మన దిక్కు మనమే,మన నుదిటి రాత మళ్లీ మనమే రాసుకోవాలి,రాస్తున్న ఈ క్షణం లో కూడా వార్త వస్తుంది,సరిత అనే అమ్మాయి తెలంగాణా కోసం ఆత్మాహుతి,నిన్న సవేరా ,ఇంకా ఎందరో ౩౦౦ దాటాయి,౩౦౦౦ దాటినా ఈ ప్రజాస్వామ్యం మనల్ని కనుకరించే సూచనే లేదు.
ఇవాల్టి నినాదం విజయమో ,వీర స్వర్గమో..పోరాటమో ప్రాణ త్యాగమో..ఇంకా వేచి ఉంటె లాభం లేదు,ఇంకో మార్గం లేదు ,ప్రాణాలను పనం పెట్టే మరో సాయుధ పోరాటం,ఇదే రాబోయే తెలంగాణా పోరాట విధి విధానం..

Thursday, February 18, 2010

లఠీలు...తూటాలు ... రాజకీయ రంగులు..

తెలంగాణా అంతా ఆందోళనగా ఉంది.తెరాస రాజీనామాల బాట పట్టారు.కాంగ్రెస్ మొండి చేయి చూపించింది.తె దే పా తనదైన శైలి లో నాటకాలు ఆడుతుంది.ప్రజల సహనానికి పరీక్ష ,విద్యార్థులకు లాఠీలతో శిక్ష.ఇదంతా అనుకున్నదే..
ఫెబ్రవరి 14 ,2010..తెలంగాణా చరిత్ర లో బ్లాక్ డే.ఉస్మానియా విశ్వవిద్యాలయం లో చదువుల చెట్టుకు ,ఖాఖి చెదలు పట్టాయి.డఎర్ మళ్లీ జాయింట్ కమీశ్నర్ సీతారామాంజనేయులు లా తిరిగి పుట్టాదేమో..ఇది భారత స్వతంత్ర ఉద్యమం లో జరిగిన జలియన్ వాల భాగ్ ఆ అనిపించింది.గేట్లు మూసేసి,వేల కొద్ది బలగాలు మొహరించి,అబ్బాయి ,అమ్మాయి అని తేడా లేకుడా చితకబాదారు,దుర్భాషలాడారు,భాషప వాయువు వదిలారు,ఎన్నో రౌండ్లు రుబ్బెర్ బుల్లెట్లు తో కాల్చారు...
వీరంగం ఇంకా ఆగక ,మీడియా వాళ్ళ తలలు బద్దలు కొట్టారు,రక్షణ కవచం లా వాడుకొని విద్యార్థులు రాళ్ళు విసిరితే వాళ్ళకి తగిలేలా చేసారు,మీడియా బండ్లను పోలీసులు తగలబెట్టారు...
ఇంత నిరంకుశమైన కాంగ్రెస్ పాలనా విధానాలు ,యావత్తు ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చాయి..తె దే పా ఖండించింది మరి వెళ్ళలేదు?ఆపలేదు? ఎందుకో తెలంగాణా ప్రజలు అడిగితె మళ్లీ తప్పు ? కాంగ్రెస్ అయతే పోలీసులను వెనకీసుకోచ్చింది ,అసెంబ్లీ లో హొమ్ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తిగా అబద్దం.. హైకోర్ట్ సింగిల్ బెంచ్ అక్షంతలు వేస్తె ప్రభుత్వం ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి వెళ్ళింది,అది తిడ్తే ఏకంగా సుప్రీం కోర్ట్,ఇవాళ అది అక్షింతలు వేసింది..అయనా ప్రభుత్వానికి చలనం లేదు..నిరకుశాత్వానికి పరాకాష్ట ఈ రోశయ్య ప్రభుత్వం.
తెలంగాణా కష్టాలు ప్రజలు తెచ్చుకున్నవే కాంగ్రెస్ కి వోట్ వేసి,గెలిపించి..ఈ శిక్ష తప్పదు.రాజకీయాలు కాదు ఉద్యమం తో వస్తది అన్నది కూడా తప్పే,రాజకీయ ప్రక్రియ లేకుండా ఎంత ఉద్యమించినా జరుగదు..ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,తెరాస ఒక్క సీట్ బై elections లో ఓడిపోయినా తెలంగాణా ఉద్యమం ఇంకో తరం వెనక్కి పోతది..కే సి ఆర్ రాజీనామా తప్పో ఒప్పో ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంది,విమర్శించే విష్ణు నే ఆమరణ దీక్ష కు కుర్చోమనే ప్రజా చైతన్యం రావాలి..ఇవాళ కోడిగుడ్లు తో దాడి కాదు,రేపు వోట్ల తో ఈ పార్టీలను శాశ్వతంగా వెలివేయాలి..అవసరమొస్తే భా జ పా కైనా అవకాశం ఇవ్వాల్సిందే,తెలంగాణా తెచ్చుకోని తీరాల్సిందే..ఇప్పుడు కావాల్సింది ఉద్యమం కాదు,ఆవేశానికి సరైన ఆలోచన ,కొంత సహనం ,సంయమనం,మనల్ని మన ఉద్యమాన్ని కాపాడుకోవడం..

Saturday, February 13, 2010

శ్రీకృష్ణ కమిటి ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం?

శ్రీ కృష్ణ కమిటి విధివిధానాలు తెలంగాణా ప్రజలను తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి.వ్యతిరేకించడానికి ముఖ్య కారణాలు:
1.తెలంగాణా ఇస్తే ఏర్పడబోయే సమస్యలు ఏంటి,వాటి పరిశ్కారలేంటి?దీనికి కమిటి వేసిఉంటే హర్షించేవాళ్ళం,కనీసం తెలంగాణా రాష్ర ఏర్పాటు ఎందుకు అడుగుతున్నారు?ఎటువంటి ఒప్పందాలు జరిగాయి ?ఎంతవరకు ఉల్లంఘనకు గురయ్యాయి?ఈ వాదన లో నిజమెంత అని కమిటి వేసినా ఒప్పుకునేవాళ్ళం.కానీ 53 ఏళ్ళ తెలంగాణా కు ,53 రోజుల సమైక్య వాదానికి ముడిపెట్టడం తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.తెలంగాణా లో రెండు వాదాలుంటే వేరు,ఇక్కడే ఒకటే వాదం తెలంగాణా వాదం ,వీళ్ళు కలిసుండాలో ,విదిపోవలో ఆంధ్ర వాళ్ళని అడుగుతాం అంటే ఎంత నీచంగా ఉంది.
2.తెలంగాణ ఉద్యమానికి అసలు మూలము నది జలాల సమస్య,దాని ప్రస్తావన లేదు .
౩.ఇడ్లి సాంబార్ గో బ్యాక్ కావొచ్చు,ఆంధ్ర వాలా భాగో కావొచ్చు ఆ నినాదాలు రావడానికి ఇక్కడి కొలువులు అక్కడి వారు దోచుకోవడం,ముల్కి ,610 జి.ఒ ఉల్లంఘన.మరి ఆ ఉద్యోగుల ప్రస్తావన లేదు.
4.వీళ్ళు వేసిన అభివృద్ధి కమిటి కి 10 నెలల గడువు అనవసరం,ఇది కేవలం కాలయాపన చేసి ఉద్యమాన్ని నీరు గార్చేతందుకే .విదివిధనాలోన్నే పక్షపాతం ఉన్నాక రాబోయే రిపోర్ట్ తెలంగాణా కు అనుకూలంగా ఉంటుందని ఎలా విశ్వసిన్చామంటారు తెలంగాణా జనాలని?
5.పోనీ ఈ కమిటి కి రాజ్యాంగ బద్ధత ఉందా అంటే లేదు ? రేపు ఈ కమిటి సిఫార్సులు సమైక్యవాదులు ఒప్పుకుంటారని లేదు.
కమిటి ని స్వాగతించే తెలంగాణా వాళ్ళెవరన్నా ఉంటె,వాళ్ళందరూ నిజంగా తెలంగాణా ఉద్యమ ద్రోహులు,ఇంకా అనుమానమే అవసరం లేదు.
తెలంగాణా గాయపడిన దేహం తో ,అవమాన భారం తో,మోసపోయిన దీనత్వం తో,మళ్లీ ఉద్యమానికి కదులుతుంది..
ఈ కన్నీటి కథ కు అంతం పలికే దెప్పుడో? ఇంకెన్ని ఉద్యమకుసుమాలు నేలరాలాలో ,ఇంకెన్ని అసువులు మంటల్లో కాలాలో ?

Thursday, February 11, 2010

రాష్ర విభజన అంటే కేకు కట్ చేయడం కాదు..

రాష్ట్ర విభజన అంటే కేకు కట్ చేయడం కాదు..ఇది మన రాష్ట్ర, సారి, మన గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిఁ వీరప్ప మొయిలి గారి మాట,ఢిల్లీ j m u తెలంగాణా విద్యార్థులు నిలదీస్తే చెప్పిన సమాధానం.మరి ఇంత కష్టమైన పనిని,అంత సులువుగా మీ ఎన్నికల మానిఫెస్టోలో ఎలా చేర్చారో సెలవిస్తారా..?ఇదే ప్రశ్న తెదేపా పార్టీ కి కూడా వర్తిస్తుంది.
మాటే కదా అని వాడారే తప్పితే,ఇచ్చేది చచ్చేది లేదనుకొని వీరు వెలగబెట్టిన పని,ఇంత మంది తెలంగాణా తల్లుల కడుపు కోత,తెలంగాణా కి మరింత క్షోభ,ఇరు ప్రాంతాల మధ్య మరిన్ని విద్వేషాల మంట..
కే.వి .పి ఆస్తుల మీద చంద్రబాబు విమర్శలు,బాబు మీద చిత్రగుప్తుని లేఖాస్త్రాలు...తెలంగాణా మాటను తోవ నుండి తప్పించడానికి ఇరువురి కుటిల ప్రయత్నాలు..మధ్యలో ఇంకో ముసలినక్క బడ్గ్ద్గెట్ సమావేశాలు జరపాలని వంక తో కమిటి విధివిధానాలు రాకుండా కాలడ్డం పెట్టడం,సమీక్ష అంటూ తిరగడం,జై తెలంగాణా అంటే సహించకపోవడం.
తెలంగాణా వస్తదో రాదో తెలీదు కాని,ఈ వ్యక్తులను , ఈ రెండు పార్టిలను తెలంగాణా ప్రజలు శాశ్వతంగా బహిష్కరించాలేమో...ప్రజలంటే విలువలేదు,ప్రజాస్వామ్య మంటే గౌరవం లేదు,భారతి నేటి నీ దుస్థితి,ఈ దుర్యోధన దుష్యసన కీచక రాజకీయ చదరంగం లో నీ కన్నీటికి బేరం కట్టే స్తితి.
ఇవాళ దేశమంతా చదువుకున్న అజ్యానులు,లేకుంటే నాలుగు కోట్ల తోటి భారతీయులు ఇన్ని అవస్తలు పడుతుంటే ఏమయ్యిందని అడిగే నాధుడు లేదు,మన సమస్య కాదనుకోవడం దేశ సమైక్యతను పెంచుతుందా?చిన్న రాష్ట్రం అడగటం పెద్ద నేరం లా చూస్తున్నారు,ఈ అణగారిన మనుషుల గోడు ఒక సారైనా కనీసం వినరే?చచ్చేవాడి ఆఖరి కోరిక తీర్చాలంటారు,మరి 200 చావుల తరువాత కూడా మీలో ఆ మానవత్వం కదలట్లేదా?
గాంధీ పుట్టిన దేశం లో మా శాంతి సత్యాగ్రహాలు ధనికుల లాబీయింగ్ ముందు ఓడిపోతుంటే,ఆయన ఆత్మా ఎంత బాధపడుతుందో ..మళ్లీ పుట్టుకరావాలేమో ఆ నేతాజీ మా ఈ స్వరాజ్య సమరం లో... రేపటి తెలంగాణా మహొదయం లో...

Tuesday, February 9, 2010

రేపటి తెలంగాణ పై అపోహలు...

తెలంగాణ వస్తే దొరల రాజ్యం అవుతది, లేదంటే నక్సల్స్ రాజ్యం అవుతది ఇలాంటి వాదనలు వింటున్నాం,రెండు ఒకరే అనడం విశేషం,నక్సల్స్ ఉన్నాక దొరల రాజ్యం ఎలా ఉంటది?సామాజిక అణిచివేత తోలిగిపోయక నక్సల్స్ ఉద్యమం దేనికి ఉంటది?అణగారిన కులాల పోరాటం దేశమంతా ఉంది,తెలంగాణ వచ్చినా కొన్నాళ్ళు ఉండొచ్చు,ఇంకా తొందరగా ఆ వైషమ్యాలు పోయి సమ సమాజం ఏర్పడా వచ్చు ,ఇంత ఉద్యమం చేసిన వాళ్ళం దానికి సహకరించమా ..
తెలంగాణ ఉద్యమం వళ్ళ హైదరాబాద్ లో పెట్టుబడులు పోతున్నాయ్ అని మాట్లేడేవారు ఉన్నారు.మాకు ఆ పెట్టుబడుల వళ్ళ భూములు పోయినయ్,మరి ఉద్యోగాలు కూడా రాలేదు ,మాట్లాడేవారు ఒక్కరోజు కూడా ఈ అన్యాయం ప్రశ్నించాలేదే?
పోనీ ఒక్క రాత్రి లో రిలయన్స్ మీద అంత పెద్ద దాడి జారినందుకు మరి పెట్టుబడులు పోతున్నాయి అని మాట్లాడలేక పోయారెందుకు?అసలు పెట్టుబడులు పోవడానికి తెలంగాణ ప్రజలు కారణమా?వారికి ఇచ్చిన మాట తప్పిన రాజకీయ పార్టీలు కారణమా?బలవంతపు ఉద్యమం నడుపుతున్న సమైక్యవాదులు కారణమా ?
మీకు సత్తా ఉంటె ఉద్యోగాలు రావా ? ఇదొక వెర్రి ప్రశ్న?అసలు తెలంగాణ లో మీరు పెట్టిన బడులెన్ని ? నిజాం ప్రభత్వం కింద అక్షరాస్యత శతం 81/1000,అది కూడా ఉర్దూ మీడియం.అది అదనుగా తీసుకోని మిలిటరీ రూల్ కింద ఇక్కడి ఉద్యోగాలు ఆంధ్ర మేధావులు తీసుకోలేదా ? దొంగ ముల్కి సర్టిఫికెట్లు పెట్టలేదా?నీళ్ళు లేక పంట లేక ఆకలి తో బిడ్డలను అమ్ముకుంటుంటే ,ఎలా వస్తది అక్షరాస్యత?బడులు లేవు,సరైన సంఖ్య లో ప్రభుత్వ కళాశాలలు లేవు,అన్ని ఎదురీది చదవితే,ఇవాళ ఓ osmaniana మెడికల్ కాలేజీ లేదా గాంధీ తీసుకుంటే 1500 లో 400 మంది కూడా తెలంగాణ వాళ్ళు లేరు?హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటే లో ఓ అమ్మాయి వాపోతుంది ,మా బాచ్ లో ముగ్గురమే తెలంగాణ వాళ్ళం.నిబంధనలన్నీ ఏ గాలి లో కలిసిపోయాయ్ ?మమ్ముల్ని చదువే చదువ నివ్వరు,చదివినా ఉద్యోగాలు అస్సలు ఇవ్వరు,మాకు సత్తా, సామర్ధ్యం లేదని వ్యంగ్య ప్రహసనాలు.మీకంత సామర్ధ్యం ఉంటె మీ ఆంధ్ర నెందుకు వెళ్లి అభివ్రుది చేసుకోరు?మాకెందుకు మీ విషపు మర్రి చెట్టు నీడ.
మాకు 200 వందల కోట్ల ఫల్యోవర్లు వద్దు,ఔటర్ రింగ్ లోద్దు,కావాల్సింది మా రైతులకు కాసిన్ని నీళ్ళు.మా చేనేతకు కాసింత ఆసరా.మా పోరాగాల్లకు గ్యానమిచ్చే నాలుగు అక్షరం ముక్కలు,మా తల్లులకు పురిటికి దగ్గరలో ఆసుపత్రులు, అపోల్లో లు కేర్ లు వద్దు,దారిలో ప్రాణం పోకుండా నాలుగు ధ్రమసుపత్రులు,గుల్ఫ్ లో చావులు కాదు కడుపు నిన్డటానికి కొలువులు,మా ఈ కోరికలు కోరరానివని మాట్లాడితే మాకా దేవుడే దిక్కు చూపించాలి.
ప్రత్యేక తెలంగాణ మేజిక్ పిల్ కాదు ,వెంటిలేటర్ మా ఆఖరి ప్రయత్నం ఇక్కడి బతుకుల్ని కాపాడటానికి..
రేపు తెలంగాణాను ఎలా అభివృద్ధి చేస్తామో ఇవాళ చెప్పమంటారు,అయ్యా!ముందు బతకనివ్వండి,కోమా నుండి బయటికి రానివ్వండి ,మా కష్టాలు మేము పడతాం,నవ్విన నాపచేనే పండుతదని మాలాంటి అజ్యానుల నమ్మకం..విజ్యులు ఇక సెలవు తీసుకోండి ,మా ఇంటి నుండి సగౌరవం గా బయలుదేరండి..

Sunday, February 7, 2010

సమైక్య రాగం..హైదరాబాద్ వాదం..

చాలా వ్యాసాల్లో చూసాను ,తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర కోరిక, దేశ సమైక్యతను దెబ్బతీస్తుందని,ఇది దేశ విభజన గా మారుతుందని అభిప్రాయాలు.నాకు విడ్డూరంగా ఉంది,ప్రజాస్వామిక దేశం లో ,ప్రజలు మాకు నీళ్ళు లేవు,కూడు లేదు,చదువుకునే అవకాశం లేదు,ఉద్యోగాలు అంతకంటే లేవు,మమ్మల్ని మా దారిన బ్రతకనివ్వండి,మీతో కలిసి మేము నష్టపోయాం అని వాపోతుంటే ,వారికి రక్షణ కల్పించడం భారత ప్రభుత్వ కనీస భాద్యత కాదా.పోనీ ఇది మొదటిసారా? ఎన్నో సార్లు వాగ్దానాలు ,ఉల్లంఘనలు.హిందూ ధర్మం లో పెళ్ళికి విలువ ఇస్తుంది,కలిసుండమనే చెబుతుంది,మరి విడాకుల చట్టం ఎందుకొచ్చింది ,కలిసుండటం పేరు మీద దురాగతాలు జరిగితేనే కదా.ఇవాళ తెలంగాణా మీద ఎన్ని దురాగతాలు జరిగినవి,ఇపుడు విడాకులు కోరితే తప్పేముంది?
సమైక్య వాదులకు సూటి ప్రశ్న?దేశ సామైక్యత కోసం ఇన్ని రాష్ట్రాళ్ళు మొత్తం తీసివేసి కేవలం భారత రాష్ట్రం మిగుల్చుదామా?పాలన సాధ్యమేనా?పాలన సౌలభ్యం కోసం రాష్ట్రాలు ,జిల్లాలు, మండలాలు,ఊళ్ళు .ప్రజల ఇష్టాలకు తావు లేని సామ్రాజ్యవాద దృక్పధం తో నడుస్తుంది సమైక్య వాదం(దీన్ని ఉద్యమం అనటానికి నేను ఇస్తాపదట్లేదు,ఎందుకంటే ఇది పెట్టుబడిదారుల వాదం,ప్రజలది కాదు).
సమైక్య వాదానికి పాపం దివంగత నేత పొట్టిశ్రీరాములు పేరును వాడుకుంటున్నారు.ఆయన మద్రాసు రాజధాని గా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని ప్రాణాలు అర్పించారు,ఆయన కోరిక తీరనేలేదు,ఆయనకు తెలంగాణా కు ఎటువంటి సంభంధం లేదు.పోనీ భావజాలం అయతే,ఆయన కూడా వేర్పాటువాది.
సమైక్య వాదం అంటే తెలంగాణా ప్రజలను ,నాయకులను దూషించడం ,ద్వేషించడం ,తెలంగాణా వాదాన్ని అవమానపరచడమా..సమైక్య వాదం కన్నా హైదరాబాద్ వాదం గా దీనికి పేరు మారుస్తే బాగుందేమో ,ఎందుకంటే వాళ్ళ సమైక్య ఆంధ్రలో హైదరాబాద్ తప్పితే మరే తెలంగాణా ప్రాంతం లేదు.చాలా మంది సీమంధ్ర విద్యార్థులు నన్ను అడిగారు మీరు హైదరాబాద్ వదులుకోని మిగితా తెలంగాణా తీసుకోండి, మీకు మీ ప్రాంతం మీద అంత ప్రేమ ఉంటె? వందల సంవత్సరాలుగా మా రక్తం ధారపోసి నిర్మించిన హైదరాబాద్ నగరం ,యాభయ్ సంవత్సరాలు మీరు మాతో పాటు ఉన్నంత మాత్రాన మీకు అప్పగించాలా?పేద వాడికి గజం చోటు మిగల్చని ,గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ ని మేము గౌరవించాలా?రేపు మీరు బెంగుళూరు లోనో ,చెన్నై లోనో ఆస్తులు కొనుక్కుంటే అవి ప్రత్యేక రాష్ట్రాలు చేయాలా? 200 కిలోమీటర్ల దూరం లో ఉండే రాజధానిని నిజంగా రేపటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటారా? పోనీ హైదరాబాద్ కి కరెంటు.నీళ్ళు .పనివాళ్ళు,అన్ని 200 కిలోమీటర్ల దూరం నుండి తెచ్చుకుంటారా?తెలంగాణా రష్ట్రం లో అంతర్భాగం కాకుంటే తెలంగాణా ఇవ్వదు కదా?
అదుర్స్ సినిమా ని ఆపొద్దు, నేను తెలంగాణా బిడ్డను, అని జూనియర్ ఎం టి ఆర్ చెప్పుకుంటాడు,పోనిలే అని వదిలేస్తే,అదుర్స్ సినిమానే అడ్డుకోలేకపోయారు,మీరు తెలంగాణా ఏమి తీసుకొస్తారు ? అని అదే సినిమా నిర్మాత కోడాల నాని రెచ్చగొడతారు,ఇదా సినిపరిశ్రమ ఉండాల్సిన తీరు? కళ పేరు మీద కుటిల రాజకేయం మేము సాహించాలా?
తెలంగాణా నే కాదు ఆంధ్ర కూడా ఆలోచించాలి ,ఈ రాగం వాదం ఎవరి కడుపు నింపడానికి?ప్రజల పై పెట్టుబడి దారుల పెత్తనాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకిన్చాల్సిందే.,ప్రశించాల్సిందే?

Wednesday, February 3, 2010

తెలంగాణ గోరింట సెగలు....

ఇప్పుడు రాసే ప్రతి అక్షరం లోను ఉద్వేగం ఉంది,నిన్నటి తెలంగాణ ఆవేశం ఉంది,రేపటి తెలంగాణ కై ఆశ ఉంది,అన్నిటికన్నా చరిత్ర ను వక్రీకరించకుండా, ఒక సామాన్యుని కోణాన్ని, ముందు తరాలకు భద్రపరచాలన్న ఆకాంక్ష ఉంది,ఆ భాద్యత కూడా నాలాంటి చదువుకున్న విద్యార్థులు మీద ఉంది.
తెలంగాణ కోటి రతనాల వీణ,నిజాము నిరకుషత్వం లో,సీమంధ్ర అనిచివేతలో,తీగలు తెగి ,అగ్ని లో తోయబడి,నేడు విప్లవ రాగాలు పలుకుతున్న రుద్రవీణ ఇది.1969 లో తూటాలకు ,2009-10 లో అత్మహుతులకు రక్తం లో తడిచి ,మంటల్లో కాలి ,ఈ నేల గోరింట సెగల తెలంగాణ గా మారింది .
ఇలాంటి చారిత్రిక ఉద్యమం లో పాల్గొనే అవకాశం వచ్చిన వాళ్ళందరం అదృష్టవంతులం.ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు,అధర్మం వైపు నిలిచేవాడు ఎంత దోషో,ప్రేక్షక పాత్ర వహించేవాడు అంటే దోషి,ఇది నేను చదివిన భగవద్గీత,నేను నమ్మిన కృష్ణుని మాట.యధ్రుచికమే కానీ ఇవాలే జస్టిస్ శ్రీకృష్ణ అద్వర్యం లో కమిటీ ఏర్పడింది.విధి విధానాలు ఖరారు కాలేదు కానీ ,నిరాశ పరిచేలా ౩ ఏళ్ల కాలపరిమితి అని వార్తలు వస్తున్నాయి.పాండవులు 5 ఊల్లు అయనా పర్లేదు అని కృష్ణుడిని కౌరవుల దగ్గ్గరికి రాయబారం పంపారట మన తెలంగాణా కాంగ్రెస్ ప్రజాప్రతినిదుల్లా,ద్రౌపదీ అన్నా మరి నాకు జర్గిన అవమానానికి సమాధానం లేదా?అని బాధను వెల్లడించింది,తెలంగాణా తల్లి లా.ఈ శ్రీ కృష్ణ రాయబారం విఫలమైతే,తర్వాత జరిగే కురుక్షేత్రం సీమంధ్ర ప్రజలు కొని తెచ్చుకునే పెను ప్రమాదం.
తెలంగాణ ఉద్యమం ఈ దఫా ఇప్పటివరకు చాల శాంతియుతంగా జరిగింది,అయినా ఇందులో అసాంఘిక శక్తులు చొరబాడ్డాయని నివేదికలు,వ్యాఖ్యానాలు.సాధారణ పరిస్థితుల్లో ఆయుధాలతో సాధిస్తాం అనే సిద్దాంతాన్ని నేను నమ్మకున్నా,జరిగేది తెలంగాణా విముక్తి పోరాటం,మరో దఫా స్వతంత్ర పోరాటం,ఇటువంటి పరిస్తితిలో అతివాదుల నైనా ,మితవాదుల నైనా,సమానంగా గౌరవించాలి.అయినా ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను రాజకీయ పార్టీలు గౌరవించకుండా,వాళ్ళ భావాలతో,బతుకులతో ఆడుకుంటుంటే ,కంచే చేను మేస్తే అన్నట్టు ప్రభుత్వాలు ,ప్రతిపక్షాలు ప్రజల్ని మోసం చేస్తే ,వాళ్ళ గోడు ఎవరు వినాలి,వాళ్ళని ఎవరు ఆదుకోవాలి.
తెలంగాణా ప్రజలకు ఇపుడు ముందున్న ప్రశ్న,ఇంతలా పోరాడం ,అందరం ఒక్కటై గొంతెత్తి చాటం,అయనా పెట్టుబడిదారుల ముందు ప్రజలు ఓడిపోతూనే ఉన్నారు.ఇంకెలా పోరాడాలి,పోరాటానికి దిశా దశ ఏంటి? ఈ సంఘర్షణలో చాలామంది నిరాశానిస్పృహల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.సమైక్య వాదం చేసేవాళ్ళు కనీసం జాలి, మానవత్వం లేకుండా ,ఆత్మాహుతి దళాలు ,ltte లాంటి తీవ్ర పదజాలం తో ఇక్కడి ప్రజల గాయాల పై కారం పూస్తున్నారు.నిజానికి ఇవాళ ఆంధ్రకైన,తెలంగాణా కైనా నిజమైన అసాంఘిక శక్తులు ఈ పెట్టుబడిదారులే.
తెలంగాణా లో తెలంగాణా వాదం లేదంటే నవ్వొస్తుంది,దీన్నిఏదో మంత్రం వేసి అపగలమనుకుంటే అది అవివేకం కాక మరొకటి కాదు.నాకు తెలంగాణా ఉద్యమం తో మొట్ట మొదటి పరిచయం అయింది నా 10th క్లాస్ లో అంటే పదిహేడేళ్ళ వయసులో ,అది ఏదో మాటల సందర్భం లో కృష్ణ,గోదావరి నదీ ప్రవాహాల విషయం లో ,తెలంగాణకు జర్గుతున్న నీళ్ళ దోపిడీ గురించి.ఆ రోజు నేను అక్కడే మరిచిపోయిన విషయం ,ఎవరైనా పెంచి పోషించారంటే అది ఈ సీమంధ్ర పాలకుల వ్యవహారాలే.జర్గుతున్న అన్యాయాన్ని ,దోపిడిని,అనిచివేతను భరించలేక,చరిత్రను చదవాల్సి వచ్చింది,పరిష్కారం ఆలోచించాల్సి వచ్చింది,ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే మార్గం అని తేల్చుకోవాల్సి వచ్చింది.ఈ ఆరేళ్ళ లో ఉద్యమం ఇలాగే అందరి మనస్సులో ఎదుగుతూ వచ్చిందేమో,అసలు ఈ యాభై మూడేళ్ళలో నివురు గప్పిన నిప్పులా,నిర్విరామంగా ఉద్యమం నడుస్తూనే ఉందేమో.ఇవాళ సంవత్సరం పాప జై తెలంగాణా అంటుంటే,ఐదేళ్ళ పిలగాడు బండెనక బండి కట్టి ...అని పాట పాడుతుంటే, ఉద్యమం ఈ నేల వారసత్వమై విరజిల్లుతుంటే,ఈ తపస్సుకు ఏదో రోజు భాగీరధ ప్రయత్నం లా ఫలించి ,స్వతంత్ర గంగ ఈ నేల మీదికి పరుగులు తీస్తూ రాదా,ఆ అమరుల ఆత్మలకు ముక్తి చెకూర్చదా ..